: తరలివచ్చిన వేలాది మందితో గోదావరి తీరం కళకళ... అంత్య పుష్కరాలు ప్రారంభం


గోదావరి నది అంత్య పుష్కరాలు నేటి సూర్యోదయం వేళ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప రాజమండ్రిలో, మంత్రి మాణిక్యాలరావు నరసాపురంలో అంత్య పుష్కరాలను ప్రారంభించగా, ఏపీతో పాటు ఒడిశా, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ప్రతి సంవత్సరమూ ఒక్కో నదికి ఆది పుష్కరాలు ప్రారంభమయ్యేందుకు 12 రోజుల ముందు గత సంవత్సరం పుష్కరాలు జరిగిన నదికి అంత్య పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఆది పుష్కరాలకు వచ్చినంత మంది భక్తులు అంత్య పుష్కరాలకు రాకున్నా, కనీసం 5 లక్షల మంది వరకూ గోదావరి తీరానికి వస్తారని అంచనా వేస్తున్న ప్రభుత్వం, అందుకు ఏర్పాట్లను చేసింది. కాగా, ఈ ఉదయం ఎంపీలు మురళీమోహన్, గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, స్వామీజీ కమలానంద భారతి తదితర ప్రముఖులు పుణ్యస్నానాలు చేశారు. కాగా, రంపడోడవరంలోని విలీన మండలాల్లో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున అంత్య పుష్కర స్నానాలకు అధికారులు అనుమతించడం లేదని తెలుస్తోంది. తమను అడ్డుకుంటున్న అధికారుల తీరుపై భక్తులు నిరసన తెలుపుతున్నారు.

  • Loading...

More Telugu News