: కింకర్తవ్యం, ప్రజలకేం సమాధానం చెప్పాలి?... ఎంపీలందరినీ పిలిచిన చంద్రబాబు
రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇచ్చే పరిస్థితుల్లో కేంద్రం లేదని స్పష్టమైన వేళ, ప్రజలకు ఏం సమాధానం చెప్పాలన్న ఆందోళనలో ఉన్న చంద్రబాబునాయుడు, ఈ ఉదయం 10 గంటలకు ఎంపీలందరితో సమావేశం కావాలని నిర్ణయించారు. రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారందరినీ రావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ కాగా, విజయవాడలో వారితో సమావేశమై, పార్లమెంటులో ఎలా వ్యవహరించాలన్న విషయమై సలహా, సూచనలు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజల సెంటిమెంటుతో కూడుకున్న అంశం కావడం, బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ, హోదాను తేవడంలో తెలుగుదేశం విఫలమవుతుందన్న విమర్శల నేపథ్యంలో ముందడుగు ఎలా వేయాలన్న విషయమై ప్రధానంగా ఈ భేటీలో చర్చ జరగనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. హోదా కోసం లోక్ సభలో పోరాటం చేస్తేనే మంచిదని అనుకుంటున్న చంద్రబాబు, అదే విషయాన్ని ఎంపీలకు ఆయన తేటతెల్లం చేసి పార్టీ వైఖరి హోదాకు అనుకూలమన్న సంకేతాలను ప్రజల్లోకి బలంగా పంపాలని భావిస్తున్నట్టు సమాచారం. కాగా, బంద్ లు, ధర్నాలు, నిరసనలతో ఎలాంటి లాభం ఉండదని చంద్రబాబు నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.