: నేను చెప్పినట్టు 'బంద్' చేయండి: చంద్రబాబు
బంద్ అనే పదానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొత్త భాష్యం చెప్పారు. పార్లమెంటులో చర్చ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ప్రకటించకపోవడంపై వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీలు బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంద్ ఎలా చేయాలన్న దానిపై సీఎం చంద్రబాబు మార్గదర్శకాలు సూచించారు. బంద్ అంటే రాష్ట్రం మొత్తం చీపుర్లతో శుభ్రం (స్వచ్ఛ భారత్) చేయాలని అన్నారు. అలాగే ఎవరు ఏ పని చేస్తున్నారో ఆ విధుల్లో అదనపు గంటలు పని చేయాలని సూచించారు. ఇలా చేసినప్పుడు వేసుకున్న దుస్తులకు బ్లాక్ రిబ్బన్ ధరించాలని అన్నారు. సాధారణంగా చేసే పని కంటే మరింత ఎక్కువ పని చేసి కొత్త పద్ధతిలో బంద్ చేయాలని ఆయన చెప్పారు. అలా కాకుండా ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ప్రత్యేకహోదా కోసం తాము పోరాడతామని, పార్లమెంటులో ఎంత తీవ్రంగా పోరాడామో అంతా చూశారని, ఇకపై అంతకంటే తీవ్రంగా పోరాడుతామని ఆయన తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ఇచ్చినట్టు బంద్ చేయవద్దని ఆయన పిలుపునిచ్చారు.