: అదృశ్యమైన ఏఎన్32 విమానంలోని తమ వాడి ఫోన్ రింగవుతోందంటున్న కుటుంబ సభ్యులు!
పోర్ట్ బ్లెయిర్ వెళ్తూ మాయమైన విమానం ఏఎన్32కి సంబంధించి వెలుగులోకి వచ్చిన కొత్త కోణం ఆసక్తి రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే...జూలై 22న ఏఎన్32 విమానం బంగాళాఖాతం మీదుగా వెళుతుండగా రేడార్ తో సంబంధాలు తెగిపోవడం, గమ్యానికి చేరకపోవడం మనకు తెలిసిందే. దీంతో ఏఎన్32 గల్లంతైందని భావించిన అధికారులు దాని సిగ్నల్స్ ఆధారంగా సముద్రంలో వెతుకులాట చేపట్టారు. విమానంలో ఉన్న వ్యక్తుల కుటుంబ సభ్యులు కూడా తమవారు గల్లంతయ్యారని భావిస్తున్నారు. అయితే వారిలో ఆశ చావని ఓ కుటుంబం తమ వాడి మొబైల్ కి జూలై 26న ఫోన్ చేయగా పలు మార్లు రింగ్ అయ్యింది. అంటే విమానం కూలిన నాలుగు రోజుల తరువాత అతని ఫోన్ రింగ్ అయింది. సముద్రంలో విమానం కూలి ఉంటే... ఉప్పునీట్లో సెల్ ఫోన్ పనిచేసే అవకాశం ఎంత మాత్రమూ లేదు. అలాగే అతని మెసేంజర్ యాప్ లో 'లాస్ట్ సీన్ జూలై 26' అని ఉందని, అంటే తమ కుటుంబ సభ్యులు సముద్రంలో గల్లంతు కాలేదని, ఇందులో ఏదో కుట్రకోణం ఉందని, దానిని ఛేదించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో అధికారులు అతని కాల్ డేటా పరిశీలిస్తామని తెలిపారు. అయితే విమానం గల్లంతు ఘటనలో విద్రోహ కోణం నెలకొందని తాము భావించడం లేదని గతంలోనే అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే విమానం కూలిందని అనుమానిస్తున్న ప్రాంతంలో సముద్రం 3.5 కిలోమీటర్ల లోతున ఉందని వారు చెబుతున్నారు. అందువల్లే వెతుకులాట ఆలస్యమవుతోందని వారు తెలిపారు. కాగా, విమాన శకలాలను వెతికేందుకు యుద్ధనౌకలు, జలాంతర్గాములు, విమానాలు రంగంలోకి దిగినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడం విశేషం.