: చంద్రబాబు వైఖరిపై కేవీపీ నిప్పులు!... హోదాపై డ్రామాలాడుతున్నారని ఘాటు వ్యాఖ్య!
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ రాజ్యసభలో ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రతిపాదించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు నేటి ఉదయం ఏపీ పొలిటికల్ కేపిటల్ విజయవాడలో ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వైఖరిపై నిప్పులు చెరిగారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై చంద్రబాబు డ్రామాలాడుతున్నారని కేవీపీ ఆరోపించారు. ఏపీకి సంబంధించి కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారీ చంద్రబాబు ఇదే వైఖరిని అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రంలోని అధికార బీజేపీ స్పష్టం చేసినా... చంద్రబాబు మీనమేషాలు లెక్కిస్తున్నారని కేవీపీ మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదాపై బీజేపీ తన వైఖరిని స్పష్టం చేసిన నేపథ్యంలో టీడీపీ తక్షణమే కేంద్ర కేబినెట్ నుంచి బయటకు రావాలని కేవీపీ డిమాండ్ చేశారు.