: హామీలను విస్మరిస్తే పుట్టగతులుండవు!... టీడీపీ, బీజేపీలకు ఆర్కే రోజా వార్నింగ్!


ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదంటూ బీజేపీ సర్కారు కుండబద్దలు కొట్టిన నేపథ్యంలో నవ్యాంధ్రలో రాజకీయ వేడి రాజుకుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో తెగదెంపులకు సిద్ధమంటూ టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఫీలర్లు వదులుతుండగా, ప్రత్యేక హోదా సాధించలేని టీడీపీ సర్కారుపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తన సొంత నియోజకవర్గ కేంద్రంలో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. తిరుమల వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని మరచిపోతే... టీడీపీ, బీజేపీలకు పుట్టగతులు ఉండవని ఆమె హెచ్చరించారు. ప్రత్యేక హోదాలో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయన్న విషయంపై స్పష్టత ఉన్నందుననే తమ పార్టీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే నిరసనలు చేపట్టారన్నారు. వాస్తవాలు తెలుసుకున్న చంద్రబాబు ఇప్పటికైనా ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం బీజేపీతో పొత్తు విడనాడాలన్నారు. చంద్రబాబు ఉద్యమాలకు సిద్ధమైతే, మద్దతిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రోజా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News