: కాంగ్రెస్ ఎంపీల్లా కాదు!... హోదా కోసం ఏ త్యాగానికైనా సిద్ధం!: టీడీపీ ఎంపీ మురళీమోహన్
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని టీడీపీ సీనియర్ నేత, రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ కీలక ప్రకటన చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నేటి ఉదయం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఘాటు ప్రకటన చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటే ఉన్నపళంగా పదవులకు రాజీనామా చేసేందుకు కూడా వెనుకాడబోమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీల్లా వ్యాపారల కోసం పదవులను పట్టుకుని పాకులాడే తత్వం తమది కాదని ఆయన చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా రాని నేపథ్యంలో కేంద్రంలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఉద్యమాలతోనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందంటే... వాటికి మద్దతిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా మురళీమోహన్ ప్రకటించారు.