: కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ఎందుకింత కక్ష?: ఉండవల్లి ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై నిన్న రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఇచ్చిన సమాధానంపై కాంగ్రెస్ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ ఏపీని మోసం చేసిందని అన్నారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి రాయితీలు వచ్చి అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతోనే తాము దానిని కోరుతున్నామని ఆయన వ్యాఖ్యానించారు. హోదాపై ఎందుకు స్పష్టమయిన ప్రకటన చేయడం లేదో కేంద్రం తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ఎందుకింత కక్ష? అని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజలు ఏం తప్పుచేశారని ఆయన ప్రశ్నించారు. హోదాపై సానుకూల ప్రకటన చేయని కేంద్రం తీరుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. పోలవరం అంశంపై ఆయన స్పందిస్తూ... ఆ ప్రాజెక్టును నిలిపేయడానికి కుట్ర జరుగుతోందని అన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని, 2 వేల టీఎంసీల నీటిని ఉపయోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.