: బీజేపీని తరిమికొట్టండి.. అది కాంగ్రెస్ కంటే దుర్మార్గంగా చేస్తోంది: సినీ నటుడు శివాజీ
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ రాజ్యసభలో ఇచ్చిన సమాధానంపై ఏపీ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, తెలుగు సినీ హీరో శివాజీ మండిపడ్డారు. ‘అన్నగారు ఎన్టీఆర్ పెట్టిన పార్టీ అని టీడీపీ నేతలకు ఏ మాత్రం గౌరవం ఉన్నా వారు బీజేపీ నుంచి బయటకి వచ్చేయాలి’ అని ఆయన అన్నారు. చంద్రబాబు ఏ ఉద్దేశంతో సుజనాచౌదరిని కేంద్రానికి పంపారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రప్రయోజనాలను కాపాడడంలో సుజనా చూపిన తీరుకి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నైజం ఏంటో పూర్తిగా తెలిసి పోయిందని, టీడీపీ దాని నుంచి బయటికొచ్చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘బీజేపీని తరిమికొట్టండి.. అది కాంగ్రెస్ కంటే దుర్మార్గంగా చేస్తోంది’ అని శివాజీ వ్యాఖ్యానించారు. ‘బీజేపీ పేరు వినబడితే తరిమికొట్టండి.. అప్పుడే వారికి బుద్ధొస్తుంది’ అని ఆయన అన్నారు. ‘ప్రత్యేక హోదా మన హక్కు, అది సాధించే వరకు ఏ తెలుగు వాడు కూడా ఊరుకోకూడదు’ అని వ్యాఖ్యానించారు. హోదాపై వెంకయ్యనాయుడి తీరుపై శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు హోదా పదేళ్లు కావాలని వ్యాఖ్యానించిన వెంకయ్య ఈరోజు నిర్లక్ష్యంగా మాట్లాడడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రతి ఆంధ్రుడికి హోదా కోసం పోరాడాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు.