: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం!... టేకాఫ్ తీసుకున్న వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్!
కాలం చెల్లిన విమానాలతో ఆకాశయానం దినదినగండంగా మారింది. ఇప్పటికే రోజూ ఎక్కడో ఒకచోట విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాదు శివారులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయంలో కొద్దిసేపటి క్రితం చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే... మొత్తం 90 మంది ప్రయాణికులను ఎక్కించుకున్న ఎయిరిండియా విమానం ముంబై వెళ్లేందుకు కొద్దిసేపటి క్రితం శంషాబాదు ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ తీసుకుంది. అయితే ఆ వెంటనే విమానంలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ విషయాన్ని ఏటీసీకి చేరవేశాడు. వెనక్కు వచ్చేయాలన్న ఏటీసీ సూచనలతో పైలట్ ఆ విమానాన్ని క్షణాల్లోనే తిరిగి శంషాబాదు ఎయిర్ పోర్టులోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. ఈ ఘటనలో ఏ ఒక్కరికి అపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.