: అదృశ్యమైన విమానం గాలింపు కోసం అమెరికా సాయం కోరనున్న భారత్!


భారత వాయుసేన విమానం ఏఎన్-32 ఈనెల 22న 29 మంది సిబ్బందితో చెన్నై నుంచి పోర్టు‌బ్లెయిర్ వెళ్తూ అదృశ్యమైన సంగతి తెలిసిందే. అదృశ్యమైన క్షణం నుంచి నేటి వరకు దాని కోసం గాలిస్తున్నా ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు లభ్యం కాలేదు. దీంతో ఈ విషయంలో అమెరికా సాయం తీసుకోవాలని భారత్ భావిస్తున్నట్టు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ శుక్రవారం రాజ్యసభకు తెలిపారు. అమెరికా రక్షణ దళాల సాయం తీసుకోవాలని అనుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. అదృశ్యమైన విమానం నుంచి వారి ఉపగ్రహాలకు ఏమైనా సిగ్నళ్లు అందాయేమో ఆరా తీయనున్నట్టు చెప్పారు. విమానం అదృశ్యమైన సమయంలో రెండో రాడార్‌తో సంబంధాలు కలిగి ఉందని, అయితే ట్రాన్స్‌మిషన్ కానీ, ఫ్రీక్వన్సీ కానీ లేకపోవడంతో ఒక్క సిగ్నల్ కూడా రికార్డు కాలేదని, తమ ఆందోళనకు ఇదే కారణమని మంత్రి పేర్కొన్నారు. ఈ కారణంగానే అమెరికా రక్షణ శాఖ సాయాన్ని కోరాలనుకుంటున్నట్టు వివరించారు. విమానం అదృశ్యం వెనుక విద్రోహ చర్య ఉండే అవకాశం లేదని పారికర్ పేర్కొన్నారు. అదృశ్య విమానాన్ని గుర్తించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్టు సభకు తెలిపారు.

  • Loading...

More Telugu News