: పంజాగుట్టలో బైక్ ను ఢీకొట్టి బోల్తా పడ్డ డీసీఎం వ్యాను!... భారీగా ట్రాఫిక్ జామ్!


భాగ్యనగరి హైదరాబాదులో రోడ్డు ప్రమాదాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. నగరం నడిబొడ్డున ప్రధాన కూడలిగా ఉన్న పంజాగుట్టలో నేటి తెల్లవారుజామున జరిగిన ఓ రోడ్డు ప్రమాదం అక్కడ చాంతాడంత ట్రాఫిక్ జామ్ కు కారణమైంది. వివరాల్లోకెళితే... తెల్లవారుజామున భారీ లోడుతో వెళుతున్న డీసీఎం వ్యాను పంజాగుట్ట సమీపంలో ముందుగా వెళుతున్న ఓ బైక్ ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న ప్రసాద్‌(45), పవన్‌(21) అనే ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వాహన రద్దీ అధికంగా ఉండే పంజాగుట్టలో రోడ్డుకు అడ్డంగా వ్యాను పడిపోవడంతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. బోల్తా పడ్డ వ్యానును అక్కడి నుంచి తరలిస్తే గాని ట్రాఫిక్ జామ్ కు చెక్ పడే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వ్యానును అక్కడి నుంచి తరలించే పనులను చేపట్టారు.

  • Loading...

More Telugu News