: హత్యకు ముందు దళిత దంపతుల వద్ద ఉన్నది 5 రూపాయలే.. వెల్లడించిన కుమార్తె


పదిహేను రూపాయల కోసం రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లో దళిత దంపతులను హత్య చేసిన విషయం తెలిసిందే. సరుకులు తీసుకుని బకాయిపడ్డ రూ.15లను రోజులు గడుస్తున్నా చెల్లించకపోవడంతో ఆగ్రహంతో మెయిన్‌పురి దుకాణదారు అశోక్ మిశ్రా దళిత దంపతులు భరత్‌సింగ్, మమతాను నడిరోడ్డుపై దారుణంగా హత్యచేశాడు. వారివద్ద డబ్బులు ఉన్నా ఇవ్వలేదనే అనుమానంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే ఆ సమయంలో తన తల్లిదండ్రుల వద్ద ఉన్నది కేవలం ఐదు రూపాయలేనని వారి కుమార్తె మిలాన్(18) పేర్కొంది. ఆరోజు తిండి కోసం వారి వద్ద ఉన్నది ఐదు రూపాయలేనని చెప్పింది. ఆ డబ్బులతో బిస్కెట్లు కొనుక్కుని కడుపు నింపుకుందామని అనుకున్నారని, అయితే బిస్కెట్లు తినకుండానే వారు హత్యకు గురయ్యారంటూ కన్నీటి పర్యంతమైంది. ‘‘గురువారం నాడు వారి వద్ద కేవలం రూ.5లే ఉన్నాయి. ఆ డబ్బులతో మిశ్రా దుకాణం పక్కనే ఉన్న షాపులో బిస్కెట్లు కొనుక్కున్నారు. మిశ్రా దుకాణానికి వెళ్తే ఆ డబ్బులు ఆయన తీసేసుకుంటాడన్న ఉద్దేశంతోనే వారాపని చేశారు. అదే కనుక జరిగితే ఆ రోజంతా పస్తులుండాల్సి వస్తుంది. ఇది చూసిన మిశ్రా ఆగ్రహంతో వారిని డబ్బుల గురించి అడిగాడు. తమకు మరికొంత సమయం కావాలని అడిగారు. అయితే అప్పటికే కోపంతో ఉన్న మిశ్రా వారిని చంపేశాడు. కొనుక్కున్న బిస్కెట్లు తినకుండానే వారు మృతి చెందారు’’ అని కన్నీరు సుడులు తిరుగుతుండగా చెప్పింది. తల్లిదండ్రులను కోల్పోయిన మిలాన్ సోదరులు రాహుల్(15), రంజిత్(13), లాలు(8) దిక్కులేని వారయ్యారు. సోదరులను తనతో పాటు ఉంచుకునేందుకు భర్త అంగీకరిస్తాడో లేదోనని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల పరిహారం ఎప్పుడు, ఎలా అందుతుందో తనకు తెలియదని పేర్కొంది.

  • Loading...

More Telugu News