: మా అధ్యక్షుడిపై అమెరికా యుధ్ధం ప్రకటించింది: ఉత్తరకొరియా విదేశాంగ మంత్రి ఆరోపణ
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పై అమెరికా యుద్ధం ప్రకటించిందని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి హాన్ సాంగ్ రియోల్ ఆరోపించారు. తమ అధ్యక్షుడ్ని బ్లాక్ లిస్టులో పెట్టడం ద్వారా అమెరికా తమపై పరోక్షంగా యుద్ధం ప్రకటించిందని ఆయన పేర్కొన్నారు. తమను రెచ్చగొట్టి, భయపెట్టి, అదుపులో ఉంచుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. దక్షిణ కొరియాతో కలిసి ఎప్పటికప్పుడు సైనిక కవాతులు నిర్వహిస్తూ తమను భయపెట్టాలని భావిస్తోందని చెప్పిన ఆయన, చేతిలో కత్తి పట్టుకుని శాంతి చర్చలకు రమ్మంటున్నట్టు ఉందని అన్నారు. రాజకీయ ఎత్తుగడలతో ప్రపంచం ముందు తమ దేశాధ్యక్షుడ్ని, దేశాన్ని దోషిగా నిలబెట్టేందుకు ఒబామా ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అమెరికా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ తమ ధైర్యం సన్నగిల్లదని, తమ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సారధ్యంలో తమ దేశాన్ని రక్షించుకుంటామని ఆయన చెప్పారు.