: హైదరాబాద్ వల్లే ఇంత రగడ: ఆంధ్రప్రదేశ్ కు హోదాపై అరుణ్ జైట్లీ సమాధానం మొదలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చ ముగిసిన తరువాత ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ఇవ్వడం ప్రారంభించారు. కేవలం కాంగ్రెస్ తొందరపాటు వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో తాము ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలను కొత్తగా ఏర్పాటు చేశామని గుర్తు చేసిన ఆయన, ఆ సమయంలో ఒక్కరు కూడా వ్యతిరేకతను వ్యక్తం చేయలేదని అన్నారు. దేశంలో చిన్న రాష్ట్రాలు ఉంటేనే మరింత అభివృద్ధి సాధ్యమని నమ్మే పార్టీ బీజేపీయేనని వివరించారు. ఎంతగానో అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరం, విభజన తరువాత తెలంగాణలో ఉండిపోయిందని, హైదరాబాద్ నగరం ఆదాయం తెలంగాణకు రావడంతోనే ఏపీ లోటులోకి జారి పోయిందని తెలిపారు. గతంలో ఏ రాష్ట్రాన్ని విభజించినా, రాజధాని కదల్లేదని, అవిభాజ్య ఏపీ విషయంలో మాత్రం అలా జరగలేదని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ డ్యూటీ తదితరాల్లో రాష్ట్రానికి గరిష్ఠ ప్రయోజనాలను కలిగిస్తున్నామని జైట్లీ వివరించారు. ఆయన సమాధానం కొనసాగుతోంది.