: ప్రకృతిలో దేవుడు కొలువై ఉంటాడు.. ప్రకృతిని మనం ఆరాధించాలి: ఏపీ సీఎం చంద్రబాబు
ఈరోజు రాష్ట్రానికి ఒక పర్వదినం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కృష్ణా జిల్లా నూజివీడు మండలం సుంకొల్లులో వనం-మనం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈరోజు వనం-మనం పేరుతో మొక్కలు నాటే మంచి కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన అన్నారు. ‘ప్రకృతిలో దేవుడు కొలువై ఉంటాడు.. ప్రకృతిని మనం ఆరాధించాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరు చెట్లు పెంచే కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. చెట్లు పెంచి పర్యావరణ సమతుల్యం పాటించగలిగితే అనారోగ్యం మన దరి చేరదని చంద్రబాబు పేర్కొన్నారు. మనం మన ఇష్టమయిన వారికి ఇచ్చే బహుమతుల్లో మొక్కలు కూడా ఉండాలని ఆయన సూచించారు. వనం-మనం కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేశామని అన్నారు. మనం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ముందుగా మొక్కనాటి ప్రారంభించాలని ఆయన పేర్కొన్నారు. వనం-మనం కార్యక్రమంలో విద్యార్థుల భాగస్వామ్యం ఉండాలని ఆయన చెప్పారు. గోదావరి పుష్కరాలను పవిత్రమయిన భావంతో విజయవంతం చేశామని, పట్టిసీమను కూడా తక్కువ వ్యవధిలోనే పూర్తి చేసి మన సమర్థతను నిరూపించుకున్నామని చంద్రబాబు అన్నారు. ‘ఈ ఏడాది పుష్కరుడు కృష్ణానదికి వస్తున్నాడు.. మళ్లీ పుష్కరుడు రావాలంటే 12 ఏళ్లు పడుతుంది. గోదావరి, కృష్ణా పుష్కరాలు మన రాష్ట్రంలో జరగడం మన అదృష్టం’ అని ఆయన వ్యాఖ్యానించారు.