: ఏపీలో మొదటిరోజు 'వనం-మనం' కార్యక్రమానికి భారీ స్పందన
ఆంధ్రప్రదేశ్‌ను పచ్చని వనంలా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వనం-మనం కార్యక్రమానికి మొదటి రోజు భారీ స్పందన వస్తోంది. కృష్ణా జిల్లా సుంకొల్లు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఔషధ, రావి, వేప మొక్కలను ఆయన నాటారు. ‘ఒకే రోజు కోటి మొక్కలు’ నాటాలని ఆయన ఇచ్చిన పిలుపునకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. విజయవాడ, పశ్చిమ గోదావరి, గుంటూరు, విజయనగరం, కర్నూలు, విశాఖపోర్టులలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఒక్కరోజులో కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం పట్ల మంత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడలో వనం-మనంలో పాల్గొన్న మంత్రి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.