: ఏపీ సీఎం చంద్రబాబు ఆ వివరాలు చెప్పగానే ఎమ్మెల్యేలు విరగబడి నవ్వారట!


కాపు ఉద్యమ నేత ముద్రగడ స్వగ్రామమైన తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో బీపీ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారని ఏపీ సీఎం చంద్రబాబు అనడంతో ఒక సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు విరగబడి నవ్వారట. ఈ సీన్ గురించిన వివరాలేంటంటే... రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్న చంద్రబాబు తమ పార్టీ ఎమ్మెల్యే ల వ్యవహారశైలిపై ఆయన ఇటీవల సర్వే చేయించారు. కేవలం 20 నుంచి 30 శాతం మంది ఎమ్మెల్యేల పనితీరు మాత్రమే బాగుందని ఆ సర్వేలో తేలడం, వారికి మంచి మార్కులు లభించిన విషయం తెలిసిందే. పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సంతృప్తిపరచకపోవడంతో.. దీనిని చక్కబెట్టేందుకుగాను పదిమంది సభ్యులతో కూడిన ఒక కమిటీని సీఎం చంద్రబాబు నియమించారు. చంద్రబాబు ఇటీవల రష్యా పర్యటనకు వెళ్లిన సమయంలో ఈ కమిటీ... పనితీరు బాగున్న పాతిక మంది ఎమ్మెల్యేలను పిలిపించి ఆయా నియోజకవర్గాల్లో ఎలా పని చేశారో అడిగి తెలుసుకుని ఒక నివేదికను తయారు చేసి చంద్రబాబుకు పంపింది. రష్యా పర్యటన అనంతరం చంద్రబాబు పనితీరు బాగున్న ఎమ్మెల్యేలతో మళ్లీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన రిపబ్లిక్ లు టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాయనే విషయాన్ని ప్రస్తావించారట. అదేవిధంగా చైనాలో టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారనే విషయంపై కూడా మాట్లాడారు. టీడీపీ హయాంలో టెక్నాలజీని ఎలా వినియోగిస్తోందో కూడా చెప్పారు. ఇందులో భాగంగానే, కోర్ డ్యాష్ బోర్డులో ఆసుపత్రుల్లో ఇన్ పేషెంట్ వార్డులను అనుసంధానం చేయడం ద్వారా ఏ రోగి ఏ జబ్బుతో వస్తున్నారో కూడా తెలిసిపోతుందని ప్రయోగాత్మకంగా సీఎం చూపించారు. ఈ సమావేశం జరిగిన రోజున కిర్లంపూడిలో బీపీ పేషెంట్లు, నల్లజర్లలో షుగర్ పేషెంట్లు ఎక్కువ మంది వస్తున్నారంటూ ఆన్ లైన్ లో వివరాలను ఎమ్మెల్యేలకు చంద్రబాబు చూపించారట. ఈ సందర్భంగానే, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్వగ్రామమైన కిర్లంపూడిలో బీపీ పెషెంట్లు ఎక్కువ ఉన్నారని చంద్రబాబు అనడంతో సమావేశంలోని ఎమ్మెల్యేలు విరగబడి నవ్వడం, బాబు మాత్రం ముసిముసిగా నవ్వడం జరిగిందని టీడీపీ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News