: మద్యం మత్తులో ఏలూరు మేయర్ పుత్రరత్నం చేసిన ఏక్సిడెంట్... ఆదుకోవాలని వేడుకుంటున్న బాధిత కుటుంబం!
పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య పట్టణం ఏలూరు నగర మేయర్ ఎస్ కే నూర్జహాన్ కుమారుడు సుభానీ పూటుగా మద్యం సేవించి వీరంగం సృష్టించాడు. రాంగ్ రూటులో వెళుతూ, ఎదురుగా వస్తున్న వేమూరి కిషోర్ అనే యువకుడి వాహనాన్ని తాడేపల్లి వద్ద వేగంగా ఢీకొట్టడంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు సుభానీని బంధించి, క్షతగాత్రుడిని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఈలోగా మేయర్ పీఏ వచ్చి వైద్యానికి అయ్యే ఖర్చును భరిస్తామని, పోలీసులకు ఫిర్యాదు వద్దని బతిమాలడంతో, కిశోర్ కుటుంబ సభ్యులు తాము రాజీపడుతున్నామని పోలీసులకు చెప్పారు. దీంతో వారు కేసు పెట్టకుండా వెళ్లిపోయిన తరువాత, మేయర్ పీఏ సుభానీని విడిపించుకు తీసుకువెళ్లాడు. అది కార్పొరేట్ ఆసుపత్రి. మేయర్ వర్గం ఎలాంటి డబ్బూ కట్టలేదు. బాధితులు పేదవారు. దీంతో ఆ ఆసుపత్రి వైద్యం నిలిపివేసింది. మేయర్ పీఏకు ఫోన్ చేస్తే పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపించారు. చేసేదేమీ లేక గుంటూరులోని మరో చిన్న ఆసుపత్రికి కిశోర్ ను తరలించారు. లక్షలు ఖర్చుపెట్టి మెరుగైన వైద్య చికిత్స చేయిస్తేనే కిశోర్ ప్రాణాలు కాపాడవచ్చని వైద్యులు చెబుతుండటంతో దిక్కుతోచని స్థితిలో ఆ కుటుంబం పడిపోయింది. రోజువారీ కూలీ పనులు చేసుకునే తమకు లక్షలు వెచ్చించే స్తోమత లేదని, తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.