: ఎడతెరిపి లేని భారీ వర్షంతో ఉద్ధృతంగా కపిలతీర్థం... పొంగి పొరలుతున్న స్వర్ణముఖి
చిత్తూరు జిల్లాలో గత రాత్రి 11 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో తెల్లారేసరికి తిరుపతి, తిరుమల, చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో పరిస్థితి మారిపోయింది. ఎటు చూసినా రెండు నుంచి మూడడుగుల లోతు నీరు చేరిపోయింది. తిరుపతిలోని హోటల్ బ్లిస్ పరిసరాల్లో వందలాది ఇళ్లలోకి వరదనీరు చేరింది. శేషాచలం కొండలపై నుంచి వరదనీరు వస్తుండటంతో కపిలతీర్థం జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మరోపక్క చంద్రగిరి సమీపంలో స్వర్ణముఖి నదికి వరద పోటెత్తింది. బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సైతం వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయంలోకి వర్షపు నీరు చేరడంతో, అధికారులు మోటార్ల సాయంతో నీటిని తోడుతున్నారు. చంద్రగిరి మండల పరిధిలోని ఐకే పల్లి, పామండూరు తదితర గ్రామాల్లో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. తిరుపతిలోని గోవిందరాజస్వామి సత్రాల ప్రాంతంలో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్టు తెలుస్తోంది. సంజయ్ గాంధీ కాలనీ, ఆటో నగర్ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాతా అన్నపూర్ణేశ్వరీ ఆలయంలోకి వరద నీరు చేరడంతో, పూజలు నిలిపివేసి నీటిని బయటకు పంపించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు.