: వర్షాలకు ముందు ధరల పెరుగుదల సహజమే కదా? మమ్మల్నెందుకంటారు?: జైట్లీ
ప్రతి సంవత్సరంలో వర్షాలు కురిసే ముందు ధరల పెరుగుదల సహజంగా జరిగేదని, యూపీఏ ఉన్నప్పుడు కూడా ఇలానే జరిగిందని, ఈ సంవత్సరం ప్రత్యేకంగా ధరల పెరుగుదలను భూతద్దంలో ఏమీ చూపక్కర్లేదని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కాంగ్రెస్ ఆరోపణలపై సమాధానం ఇస్తూ వ్యాఖ్యానించారు. లోక్ సభలో చేపట్టిన ధరల పెరుగుదలపై ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో ద్రవ్యోల్బణం ఎంతో అధికంగా ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. మామూలుగా కొన్ని సరుకుల ధరలు ఇంటర్నేషనల్ మార్కెట్లతో సంబంధాన్ని కలిగివుంటాయని తెలిపారు. ఆ కారణంగానే వివిధ సీజన్ ల వారీగా కొన్ని ఉత్పత్తుల ధరలు మారుతుంటాయని అన్నారు. ద్రవ్యోల్బణం అదుపునకు తమ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుందని జైట్లీ సభకు వివరించారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలన్నీ పసలేనివని తెలిపారు. పెట్రో ఉత్పత్తులకు సబ్సిడీ తగ్గించడం వల్ల మిగిలిన సొమ్ముతో, రైతులకు ఫసల్ బీమా యోజనను అమలు చేస్తున్నామని, పేద మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ ను అందిస్తున్నామని, మౌలిక వసతులు కల్పిస్తున్నామని, ప్రతి ఒక్కరినీ బీమా గొడుగు కిందకు తెస్తున్నామని, ఇంకా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలియజేశారు.