: ఇండోనేషియాలో నేడు ఉరితీసే గురుదీప్ ను రక్షించేందుకు ఆఖరి ప్రయత్నం చేస్తున్నా: సుష్మా స్వరాజ్
ఇండోనేషియాలో మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తూ, పోలీసులకు దొరికిపోయి మరణశిక్షకు గురికాబడ్డ గురుదీప్ సింగ్ (48)ను రక్షించేందుకు ఆఖరి ప్రయత్నం చేస్తున్నామని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు. 2004లో మరో 14 మందితో కలసి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ గురుదీప్ పట్టుబడిన సంగతి తెలిసిందే. "నేడు గురుదీప్ కు మరణదండన అమలు చేయనున్నారు. ఆయన్ను కాపాడటానికి నా వంతుగా చివరి ప్రయత్నాలు చేస్తున్నా" అని సుష్మ ట్వీట్ చేశారు. జలంధర్ కు చెందిన గురుదీప్ క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించిన ఇండోనేషియా ప్రభుత్వం, నేడు నుసకంబంగాన్ జైల్లో శిక్షను అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఇండోనేషియాలో కఠినంగా ఉండే మాదకద్రవ్య చట్టాల మేరకు, పట్టుబడిన వారెవరైనా సరే మరణదండనకు గురికాక తప్పదు.