: కుట్రలో కేసీఆర్ కుటుంబ సభ్యులు లేరని నిరూపించుకోవాలి: ఎంసెట్-2 లీకేజీపై రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు
తెలంగాణ ఎంసెట్-2 లీకేజీ అంశంపై టీడీడీపీ నేత రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎంసెట్ పరీక్ష నిర్వహణ కోసం చేపట్టిన బయోమెట్రిక్ విధానంలో 2500 మంది విద్యార్థుల బయోమెట్రిక్ పని చేయకపోతే ఆ బాధ్యతను చేపట్టిన సంస్థపై సర్కార్ ఎందుకు చర్య తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. పరీక్షకు సంబంధించి ఆన్‌లైన్ విధాన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వ సంస్థను కాదని ప్రైవేటు వ్యక్తులకు సర్కారు ఎందుకు అప్పజెప్పిందని ఆయన అన్నారు. తెలంగాణ మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వీరిపై ఎందుకు విచారణ చేపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. విచారణ జరిపిస్తే కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇందులో ఉన్నారనే నిజం తెలుస్తోందని భయపడుతున్నారా? అని ఆయన ప్రశ్నించారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డిని భర్తరఫ్ చేయాలని ఆయన అన్నారు. ఆన్‌లైన్ విధానం కోసం టెండర్ ఇచ్చిన అంశం, ఓఎంఆర్ షీట్ల ప్రింటింగ్, బయోమెట్రిక్ విధానంలో లోపాలు, ఢిల్లీలో ప్రశ్నపత్రం ప్రింటింగ్ అయిన అంశాలపై సమగ్రంగా విచారణ చేపట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం అసమర్థత వల్లే విద్యార్థులకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఓ వైపు విచారణ జరుగుతోంటే మరోవైపు లీకేజీ జరగలేదని సంబంధిత మంత్రి వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు. విచారణ జరుగుతోన్న సమయంలో ఆయన అటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారని రేవంత్ ప్రశ్నించారు. లీకేజీ అంశంలో రాష్ట్ర ప్రభుత్వమే ముద్దాయి అని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాన్నే ముద్దాయిగా కోర్టులో బోనులో నిలబెట్టాలని అన్నారు. విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి నిబద్ధతలేదని ఆయన అన్నారు. ఈ కుట్రలో కేసీఆర్ కుటుంబ సభ్యులు లేరని ముఖ్యమంత్రి నిరూపించుకోవాలని ఆయన సవాలు విసిరారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.