: 'ఆధార్'పై రాజ్యసభలో విపక్షాల ద్వజం.. వెల్‌లోకి దూసుకొచ్చిన ప్రతిపక్ష ఎంపీలు
బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకునే వారు, సబ్సిడీలో గ్యాస్ పొందుతున్న వారు ఆధార్ నెంబర్‌ను అనుసంధానం చేయాలన్న అంశంపై పలువురు నేతలు రాజ్యసభలో ఈరోజు మాటల తూటాలు వదిలారు. దీంతో రాజ్యసభ పలుసార్లు వాయిదా పడాల్సి వచ్చింది. ఎంపీలు డెరిక్ ఒబ్రెయిన్, శరద్ యాదవ్ ఈ అంశంపై పలు ఆరోపణలు చేశారు. ఆధార్ నెంబర్ ఇవ్వని వారికి ఇంధన కంపెనీలు సబ్బిడీలో గ్యాస్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంక్ అకౌంట్‌తో కూడా ఆధార్ నెంబర్లు అనుసంధానం చేయాలని ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని తాము ఖండిస్తున్నట్లు ఎంపీ తపన్ కుమార్ సేన్ పేర్కొన్నారు. ఆధార్ అనుసంధానం అంశంలో కేంద్ర వైఖరిని ఆయన తప్పుబట్టారు. అనుసంధానం అవసరం లేదని వ్యాఖ్యలు చేస్తూనే మరోవైపు పలు అంశాల్లో దాన్ని కచ్చితంగా పాటించాలని కేంద్రం గందరగోళం సృష్టిస్తోందని ఆయన మండిపడ్డారు. ఒకవైపు ఆధార్ నెంబర్ తప్పనిసరి కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం తెలిపిందని, మరోవైపు కేంద్రం ఆధార్ అంశంపై ఎందుకిలా ప్రవర్తిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుకేందు శేఖర్ రాయ్ దుయ్యబట్టారు. దేశ పౌరుల్లో చాలా మంది ఇంతవరకు ఆధార్ నెంబర్ పొందనేలేదని మాజీ మంత్రి రాజీవ్ శుక్లా పేర్కొన్నారు. దేశంలో అందరికీ ఆధార్ కార్డ్ అందిన తరువాతే బ్యాంక్ అకౌంట్‌తో దాన్ని అనుసంధానం చేయాలనే నిబంధన పెట్టాలని ఆయన సూచించారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కలగజేసుకొని బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్‌ను అనుసంధానం చేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నారు. వ్యవస్థలో లీకేజీలకు అడ్డుకట్టవేయొచ్చని చెప్పారు. మధ్యవర్తులను సైతం నిరోధించొచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రతి పౌరుడికీ ఆధార్ నెంబర్ అందేవరకూ దాని అనుసంధాన్ని తాము తప్పనిసరి చేయబోమని తెలిపారు. ఈ సమాధానంతో ప్రతిపక్ష పార్టీ సభ్యులు వెల్‌లోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. కేంద్రం తీరుని ఖండిస్తూ నినాదాలు చేశారు. ప్రతిపక్ష పార్టీల సభ్యుల నినాదాల మధ్యే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ అంశంపై స్పందిస్తూ.. ఇప్పటికే 85 శాతం మంది ఎల్‌పీజీ కస్టమర్లు ఆధార్ నెంబర్‌ను అనుసంధానం చేశారని, వాటిల్లో సమస్యలేమయినా ఉంటే వాటిని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఆధార్ నెంబరు అనుసంధానం అంశం నుంచి తాము అస్సాం రాష్ట్రాన్ని పక్కకి పెట్టినట్లు, మణిపూర్‌ను ఆధార్ అనుసంధానం నుంచి తొలిగించాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ సభ్యులు తమ నినాదాలు చేశారు.