: గయోపాఖ్యానంలో పద్యాలు పాడినట్లు హోదాపై మాట్లాడుతున్నారు: భూమన ఫైర్
ఏపీలో కాంగ్రెస్ పార్టీ శవంగా మారితే, టీడీపీ జీవచ్ఛవంలా మారిందని వైఎస్సార్ సీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఈరోజు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా అంశంపై టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదా అంశంలో ఆ పార్టీల నేతలు అనుసరిస్తోన్న విధానాలను ఆయన తప్పుబట్టారు. రెండేళ్ల నుంచి టీడీపీ ఏపీ ప్రజల ఆవేదన పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. హోదా అన్న ప్రజల కోరికను, ఆశను నిరంతరం నలిపివేస్తూ టీడీపీ ప్రజల దృష్టిలో జీవచ్ఛవంలా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. గయోపాఖ్యానంలో పద్యాలు పాడినట్లు హోదాపై టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని వారిలో ఏపీకి హోదా అంశంపై నిర్లక్ష్యం ఉందని భూమన వ్యాఖ్యానించారు. మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టే పనిచేస్తున్నారని ఆయన అన్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న కారణంగానే హోదా అంశంలో కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తేవడం లేదని ఆరోపించారు. హోదా కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారని భూమన పేర్కొన్నారు. ఆనాడు మోదీ ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి సభలో మాట ఇచ్చారని, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకునేందుకు బీజేపీ సిద్ధపడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రత్యేక హోదా సంజీవని కాదని టీడీపీ అంటోందని ఆయన అన్నారు. మోదీకి ఇవ్వాలన్న ఉద్దేశమే ఉంటే వెంటనే హోదా ప్రకటించే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఒకరికి ఇవ్వాలన్న ఆలోచనే లేదు, మరొకరికి తెచ్చుకోవాలనే సంకల్పమే లేదు అని ఆయన బీజేపీ, టీడీపీలనుద్దేశించి విమర్శించారు.