: వాళ్లకి ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని పోలీసులే నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించారు: నటి మమతా కులకర్ణి
డ్రగ్స్ రాకెట్ లో పట్టుబడి అరెస్టై ప్రస్తుతం నైరోబీలో తలదాచుకున్న మాజీ హీరోయిన్ మమతా కులకర్ణి పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తన భర్త విక్కీ పోలీసులకు చిక్కిన తరువాత, కేసులో తనను ఇరికిస్తే ఉచితంగా పబ్లిసిటీ వస్తుందన్న కారణంతోనే తన పేరు చెప్పారని ఆమె ఆరోపించింది. ప్రస్తుతం నైరోబీలో తలదాచుకున్న మమతా కులకర్ణి 'మిడ్ డే'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. 1990వ దశకంలో కరణ్ అర్జున్, ఆషిఖ్ ఆవారా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో తన అందంతో కుర్రాళ్ల మతులు పోగొట్టిన ఆమె, ఆపై డ్రగ్స్ రాకెట్ లో ఇరుక్కుని బాలీవుడ్ కు దూరమైన సంగతి తెలిసిందే. "నేను బాలీవుడ్ ను వీడినప్పుడు నంబర్ 2 స్థానంలో ఉన్నాను. విక్కీ గోస్వామిని పెళ్లి చేసుకున్న తరువాత ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఆయన జైలు శిక్ష అనుభవించి తిరిగి వచ్చినా కలుసుకోలేదు. నా మానాన నేను అద్దె ఇంట్లో ఉంటున్నాను. పోలీసులే నన్ను ఇరికించారు. వారికి వచ్చిన ఇగోనే ఇందుకు కారణం" అని అంటోంది. ఖాపోలీలో గురు శ్రీ గంగగిరి మహరాజ్ ఆశ్రమాన్ని దర్శించుకున్న తరువాత తనలో ఆధ్యాత్మిక భావనలు పెరిగాయని మమత తెలిపింది. తనపై ఆరోపణలు వచ్చిన డ్రగ్స్ కుంభకోణం రూ. 2 వేల కోట్లదని పోలీసులు వెప్పిన విషయాన్ని గుర్తు చేసిన ఆమె, అంత డబ్బే ఉంటే అద్దె ఇంట్లో ఎందుకు ఉంటామని ప్రశ్నించింది. తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 25 లక్షలపై వస్తున్న వడ్డీపైనే బతుకుతున్నానని తెలిపింది.