: కమలహాసన్ నా ఇష్టానికే ప్రాధాన్యమిస్తారు: సినీ నటి గౌతమి
కమల్ తన ఇష్టానికే ప్రాధాన్యమిస్తారని సినీ నటి, ప్రముఖ నటుడు కమల హాసన్ సహచరి గౌతమి చెప్పింది. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత ‘పాపనాశం’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన గౌతమి 'మనమంతా' (తమిళంలో 'నమదు’) సినిమాతో మరోమారు ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే నెల 5వ తేదీన ఇది విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ చిత్రం మూడు భాషల్లో విడుదలవుతోందని, తెలుగు, తమిళంలో తానే డబ్బింగ్ చెప్పానని చెప్పింది. తన కూతురు సుబ్బులక్ష్మి చిన్నపిల్ల కావడం వల్లే ఇన్నాళ్లూ తాను నటనకు దూరంగా ఉన్నానని, ఇప్పుడు పెరిగి పెద్దదైందని పేర్కొంది. ‘పాపనాశం’ చిత్రంలో తాను నటించడానికి కారణం కమలహాసననే అందరూ అనుకుంటారని, అది నిజం కాదని చెప్పింది. కమల్ తనను ఏ విషయంలోనూ బలవంతపెట్టరని, తన ఇష్టానికే ప్రాధాన్యమిస్తారని పేర్కొంది. ‘పాపనాశం’ కథ నచ్చడంతోనే ఆ చిత్రంలో నటించానని, ఇప్పుడు ‘నమదు’ కథ కూడా నచ్చడంతో ఆ చిత్రంలో నటించానని గౌతమి చెప్పుకొచ్చింది.