: మళ్లీ పరీక్ష రాయడం మా వల్లకాదు: ‘ఎంసెట్ పరీక్ష రద్దు’ యోచనపై కన్నీరు పెట్టుకున్న విద్యార్థులు
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీక్ అయిన వ్యవహారంపై రాష్ట్ర సర్కారు మళ్లీ పరీక్షను నిర్వహించాలని యోచిస్తోన్న అంశంపై విద్యార్థులు స్పందిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. ‘మళ్లీ పరీక్ష రాయడం మా వల్లకాదు’ అని వరంగల్‌లో ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పరీక్షని రద్దు చేయొద్దని వారు ప్రభుత్వాన్ని కోరారు. పరీక్ష రద్దు అంశంలో తాము ఎంతో ఒత్తిడిని ఎదుర్కుంటున్నామని విద్యార్థులు వ్యాఖ్యానించారు. పరీక్ష రద్దు చేస్తే తమకు ఇక ప్రభుత్వంపై నమ్మకం ఉండదని అన్నారు. ఎంతో కష్టపడి రాశాం.. ఆ కష్టమంతా ఫలితం లేకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ పరీక్ష కోసం సన్నద్ధమయ్యే ఓపిక తమకి లేదని వారు అన్నారు. లీకేజీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పరీక్షను మళ్లీ నిర్వహించొద్దని వారు కోరారు. ఎంసెట్ 2 పరీక్షను రద్దు చేస్తారంటూ వస్తోన్న వార్తల పట్ల తమ పిల్లలు ఏడుస్తూ ఇంట్లోనే కూర్చుంటున్నారని, ఇంటి నుంచి బయటకు కూడా రావట్లేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారు. ‘మా అమ్మాయి డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది’ అని ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు, ఎంసెట్-2 పరీక్ష రద్దుపై నిర్ణయం తీసుకునే అంశంపై తెలంగాణ సర్కార్ విస్తృత స్థాయిలో సమాలోచన చేస్తోంది. దీనిపై ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.