: ఉద్యోగానికి అనువైన నగరాల్లో హైదరాబాద్... టాప్-10లో భాగ్యనగరం!


అవును.. ఉద్యోగం చేయడానికి హైదరాబాదే ఉత్తమ నగరమని యువత చెబుతోంది. ప్రాంతంతో పనేముంది, ఉద్యోగం వస్తే చాలు అన్న ఒకప్పటి వైఖరిని యువత విడిచిపెట్టింది. ఉద్యోగమే కాదు.. పనిచేసే ప్రదేశం కూడా ఎంతో ముఖ్యమని ప్రస్తుత యువత భావిస్తున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. రంగమేదైనా వారు కోరుకుంటున్నది మాత్రం అక్షరాలా ఇదే. ఇక ఉద్యోగం చేసేందుకు యువత ప్రాధాన్యమిచ్చే నగరాల్లో భాగ్యనగరం టాప్-10లో చోటు దక్కించుకుంది. పీపుల్ స్ట్రాంగ్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండ్రస్టీ, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్, లింక్‌డ్‌ఇన్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలను ఇండియా స్కిల్స్ రిపోర్టు-2016 వెల్లడించింది. వీబాక్స్ ఎంప్లాయిబలిటీ స్కిల్ టెస్ట్(వెస్ట్) పేరుతో దేశంలోని 29 రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో 5.2 లక్షలమంది నుంచి అభిప్రాయాలు సేకరించిన అనంతరం ఈ నివేదికను రూపొందించారు. 2014 నుంచి 2016 వరకు ఈ సర్వేను నిర్వహించారు. వెస్ట్ నివేదిక ప్రకారం.. బీటెక్, ఫార్మా వంటి కోర్సులు పూర్తిచేసిన వారిలో ఎక్కువమంది ఉద్యోగం కోసం ఢిల్లీ అనువైనదంటూ దానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. తర్వాత ఢిల్లీ చుట్టూ ఉన్న రాజధాని ప్రాంతాన్ని ఎంచుకోగా ఆ తర్వాతి స్థానాల్లో బెంగళూరు, చెన్నై, లక్నో నిలిచాయి. ఇక హైదరాబాద్‌కు పదో స్థానం దక్కింది. అయితే మహిళా ఉద్యోగులు మాత్రం భాగ్యనగరానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం గమనార్హం. కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువ మంది అభ్యర్థులు 22 నుంచి 25 ఏళ్లలోపే ఉద్యోగాలు పొందుతున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది.

  • Loading...

More Telugu News