: ఢిల్లీలో మారిన రాజకీయ పరిణామాలు.. ఏపీ ‘ప్రత్యేక’ బిల్లు భవిత తేలేది నేడే!


ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు భవిష్యత్తు ఏంటో నేడు తేలిపోనుంది. ఈ బిల్లును అడ్డుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించిన బీజేపీ దాదాపు సఫలమైంది. అయితే బుధవారం ఢిల్లీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ‘ప్రత్యేక’ బిల్లుపై చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో బిల్లు విషయమై సుదీర్ఘంగా చర్చించారు. చివరికి బిల్లుపై చర్చకు అంగీకరించిన జైట్లీ.. చర్చ అనంతరం బిల్లును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావుకు షరతు విధించారు. హోదా విషయంలో ప్రభుత్వం ఇచ్చే సమాధానం తమకు సంతృప్తిని కలిగిస్తేనే ఆ పని చేస్తామని మరో కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ పేర్కొన్నారు. అయితే బిల్లు విషయంలో కేవీపీ తమ మాట వినే అవకాశం లేదని కూడా ఆయన అన్నారు. గతంలోనూ ఆయన పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజ్యసభలో నిరసన వ్యక్తం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరోవైపు కేవీపీ మాత్రం బిల్లు విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారు. పార్టీ తనను సస్పెండ్ చేసినా సరే బిల్లును మాత్రం ఉపసంహరించుకునేది లేదని తేల్చి చెబుతున్నారు. ప్రత్యేక హోదాపై కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లు విషయంలో గత రెండు రోజులుగా ఢిల్లీలో హైడ్రామా చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బిల్లును అడ్డుకునేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది. ఆ బిల్లు ద్రవ్యపరిధిలోకి వస్తుందని, దానిని లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెట్టాలని జైట్లీ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేశారు. చర్చ జరిగి తీరాల్సిందేనని కాంగ్రెస్ మొన్న సభను స్తంభింపజేసింది. రాజ్యసభ కార్యకలాపాలను కాంగ్రెస్ అడ్డుకుంటుండడంతో ఈ బిల్లుకు చరమగీతం పాడక తప్పదని బీజేపీ భావించింది. అయితే ‘ప్రత్యేక’ బిల్లును కావాలనే బీజేపీ అడ్డుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించే అవకాశం ఉండడంతో ఎట్టకేలకు చర్చకు అనుమతించినట్టు తెలుస్తోంది. చర్చ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు గత రెండేళ్లుగా తాము చేస్తున్న సాయం గురించి ప్రస్తావించి మార్కులు కొట్టేయాలని వ్యూహ రచన చేస్తున్నట్టు సమాచారం. అందుకే బిల్లుపై రెండు గంటలపాటు చర్చకు అంగీకరించింది. ఈ మధ్యాహ్నం రెండు గంటలకు బిల్లుపై చర్చ ప్రారంభం కానుంది. అంటే మరికొన్ని గంటల్లో బిల్లు భవిష్యత్తు ఏమిటన్నది తేలిపోతుందన్న మాట.

  • Loading...

More Telugu News