: భూమిని నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ సమాన ధర ఇస్తున్నాం: హరీష్ రావు


భూమిని నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ సమాన ధర ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. గ్రామాలలో ఎస్సీ, ఎస్టీలన్న తేడా లేకుండా అసైన్డ్ భూములకు కూడా ఒకే ధర అమలు చేస్తున్నామని అన్నారు. పట్టాలు లేని భూములకు కూడా ఇదే ధరను అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. దళితుల్లో అసైన్డ్ పట్టాలు లేక సాదాబైనామాలు చేసుకున్నవారికి కూడా న్యాయం చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రజల మేలు కోరి ప్రాజెక్టులు చేస్తున్నామని చెప్పిన ఆయన, ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయాలన్న తపన తప్ప ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశాలు లేవని అన్నారు. వేలాది మంది ప్రజలకు న్యాయం చేయాలని భావిస్తున్న ప్రభుత్వం... వందల మందికి ఎందుకు అన్యాయం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాలు గందరగోళ పరిస్థితులు సృష్టించడం వల్ల ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయని ఆయన తెలిపారు. కోర్టులకు వెళ్లాల్సిన ప్రజలు మౌనంగా ఉంటున్న చోట...రాజకీయ పార్టీలు న్యాయస్థానాలకు వెళ్లాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశంతో ప్రాజెక్టును అడ్డుకునేందుకు విపక్షాలు సుప్రీంకోర్టుకు వెళ్తామని చెబుతున్నాయని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News