: మళ్లీ పరీక్షా?...ఇక చాలు ... కౌన్సిలింగ్ ప్రారంభించండి: ఎంసెట్ 2 విద్యార్థులు
ప్రశ్నాపత్రం లీకేజీ వార్తల నడుమ కౌన్సిలింగ్ జరుగుతుందో లేదోననే ఆందోళనలో తెలంగాణ ఎంసెట్2 పరీక్ష రాసిన విద్యార్థులు కూరుకుపోయారు. తొలుత ఎంసెట్ రాసిన తాము నీట్ పరీక్ష వివాదం నేపథ్యంలో ఆందోళన చెందామని అన్నారు. నీట్ వివాదం సద్దుమణగడంతో మళ్లీ పరీక్షకు సంసిద్ధమై ర్యాంకులు సాధించుకున్నామని విద్యార్ధులు చెబుతున్నారు. ర్యాంకులు వచ్చేశాయి, ఇక కోర్సులో జాయినవ్వడమే తరువాయి అనుకున్న తరుణంలో ఎంసెట్2 ప్రశ్నాపత్రాలు లీకయ్యాయన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. కేవలం 72 మంది చేసిన తప్పుకు 50 వేల మందికి శిక్ష విధించవద్దని విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కౌన్సిలింగ్ నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మళ్లీ ఎంసెట్ 3 అంటే చదివే ఓపిక తమలో లేదని వారు చెబుతున్నారు. మళ్లీ కొత్తగా చదవాలంటే తమపై చాలా ఒత్తిడి నెలకొంటుందని, ఈసారి మంచి ర్యాంకులు వస్తాయన్న నమ్మకం తమలో సన్నగిల్లుతోందని, ఇప్పటికే చాలా మంది మెటీరియల్ ను జూనియర్స్ కు ఇచ్చేశారని చెప్పిన విద్యార్థులు, కౌన్సిలింగ్ ప్రారంభించాలని కోరారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.