: భార్య సెల్ ఫోన్ చూసి ఉన్మాదిగా మారిపోయిన రెండో భర్త!


మరో వ్యక్తితో తన భార్య అక్రమ సంబంధం నడుపుతోందన్న అనుమానంతో, ఆమె సెల్ ఫోన్ ను చూసి ఉన్మాదిగా మారిన ఓ వ్యక్తి, ఆమెను సజీవదహనం చేసిన ఘటన నెల్లూరులో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, కనిగిరి మండలం పాతపాడుకు చెందిన సుమలత (26) అనే యువతికి 9 సంవత్సరాల క్రితం రియల్ ఎస్టేట్ వ్యాపారి రవీంద్రబాబుతో వివాహం జరిగింది. వ్యాపారంలో బాగా సంపాదించిన రవీంద్ర, ఇద్దరు పిల్లలు కలిగిన అనంతరం, అనారోగ్యంతో మరణించాడు. ఆ ఆస్తి అంతా ఇక సుమలతకు వెళ్లిపోతుందన్న భయంతో రవీంద్ర తల్లిదండ్రులు, తమ రెండో కుమారుడైన శ్రీకాంత్ తో ఆమెకు పెళ్లి జరిపించారు. హైదరాబాద్ లో ఉద్యోగం చేసే శ్రీకాంత్, అప్పుడప్పుడూ తన భార్య దగ్గరికి వచ్చి వెళుతుండేవాడు. ఈలోగా పక్కింట్లో ఉండే వ్యక్తితో తన భార్య అక్రమ సంబంధం నడుపుతోందన్న అనుమానం రావడంతో, రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లినట్టే వెళ్లి, వెంటనే వచ్చేశాడు. తెల్లవారుఝామున బస్సు దిగి ఇంటికెళ్లడంతో ఆమె గుట్టు రట్టయింది. సెల్ ఫోన్లో తెలియని నంబర్లు, మెసేజ్ లు చూసి ఆమెను నిలదీశాడు. మాటా మాటా పెరిగింది. సుమలత తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి, తనను తీసుకెళ్లాలని చెప్పింది కూడా. తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన శ్రీకాంత్ మరోసారి తీవ్రంగా వాదనకు దిగాడు. పిల్లలకు చాక్లెట్లు కొనుక్కోమని డబ్బిచ్చి పంపి, ఆపై "సుమలత ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది" అని కేకలు పెడుతూ బయటకు వచ్చాడు. నలుగురూ వెళ్లి చూస్తే, బాత్ రూములో గుర్తు తెలియని స్థితిలో ఆమె మృతదేహం కనిపించింది. పోలీసులు వచ్చి, శ్రీశాంత్ ను విచారించి, హత్య అతనే చేశాడని చెప్పి అరెస్ట్ చేశారు. ఆమెను హత్య చేసి, ఆపై కిరోసిన్ పోసి తగుల బెట్టి ఉండవచ్చని, హత్య ఎలా జరిగిందన్న విషయం పోస్టు మార్టం తరువాత తెలుస్తుందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News