: భారీ లాభాలు మాయమైన వేళ... పడుతూ లేస్తూ సాగిన మార్కెట్!
సెషన్ ఆరంభంలో అరగంట వ్యవధిలోనే నమోదైన భారీ లాభాలు, ఎఫ్ఐఐల నుంచి వచ్చిన అమ్మకాల ఒత్తిడి కారణంగా నష్టాల్లోకి జారి పోగా, ఆపై పడుతూ లేస్తూ సాగిన బెంచ్ మార్క్ సూచికలు స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. ఉదయం 10 గంటల సమయానికి క్రితం ముగింపుతో పోలిస్తే, 230 పాయింట్లకు పైగా లాభంతో ఉన్న సెన్సెక్స్, మధ్యాహ్నం 12 గంటల సమయానికి 60 పాయింట్ల నష్టంలోకి జారిపోయింది. ఆపై కొంత కొనుగోలు మద్దతు కనిపించినా, ఎక్కువగా లాభాలు దక్కలేదు. బ్రాడర్ మార్కెట్ తో పోలిస్తే, చిన్న, మధ్యతరహా కంపెనీలు మంచి లాభాలను నమోదు చేశాయి. బుధవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 47.81 పాయింట్లు పెరిగి 0.17 శాతం లాభంతో 28,024.33 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 25.15 పాయింట్లు పెరిగి 0.29 శాతం లాభంతో 8,615.80 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.60 శాతం, స్మాల్ కాప్ 0.49 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 32 కంపెనీలు లాభపడ్డాయి. ఇన్ ఫ్రాటెల్, ఐసీఐసీఐ బ్యాంక్, జడ్ఈఈఎల్, మారుతి సుజుకి, అదానీ పోర్ట్స్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, డాక్టర్ రెడ్డీస్, ఐడియా, ఐటీసీ, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,865 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,316 కంపెనీలు లాభాలను, 1,342 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. మంగళవారం నాడు రూ. రూ. 1,07,57,128 కోట్లుగా నమోదైన బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 1,07,96,205 కోట్లకు పెరిగింది.