: విజయవాడకు ఒక షేప్ తీసుకొచ్చాం: సీఎం చంద్రబాబు
విజయవాడలో ఇన్నర్ రింగ్ రోడ్డును సీఎం చంద్రబాబు ఈ రోజు ప్రారంభించారు. రామవరప్పాడు నుంచి గొల్లపూడి వరకు 9.84 కిలోమీటర్ల మేరకు రెండు హైవేలను కలుపుతూ రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి వెళ్లే వాహనాలను ఇన్నర్ రింగ్ రోడ్డుకు మళ్లించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఎప్పుడూ ఊహించని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేశామన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గడమే కాకుండా, ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. విమానాశ్రయం విస్తరణ, కృష్ణా పుష్కరాల గురించి కూడా చంద్రబాబు ప్రస్తావించారు. పుష్కరాలకు వచ్చే వారిని బంధువుల్లా ఆదరించాలని విజయవాడ ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీపై ఆయన విమర్శలు కురిపించారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విజయవాడను ఏమాత్రం అభివృద్ధి చేయలేదని, విజయవాడ సిటీని చూస్తే తన గుండె తరుక్కుపోయిందని, అందుకే, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి విజయవాడకు ఒక షేప్ తీసుకొచ్చామని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని చంద్రబాబు అన్నారు.