: ఇదేనా సూపర్ పవర్?... విమాన వాహక యుద్ధ నౌక అందుబాటులో లేని భారత్... మరో 8 నెలలు ఇంతే!
"ఇండియా సూపర్ పవర్ గా ఎదుగుతోంది" అని మీరు భావిస్తున్నారా? పప్పులో కాలేసినట్టే! ఎందుకంటే, వేల కిలోమీటర్ల సముద్ర తీరాన్ని మూడు వైపుల్లో కలిగున్న భారత్, ఒక్క విమాన వాహక యుద్ధ నౌక కూడా లేకుండా ఎనిమిది నెలలు కాలం గడపాల్సి వుంది. మనకున్న ఏకైక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఎనిమిది నెలల మరమ్మతులకు వెళ్లడమే ఇందుకు కారణం. మరో యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ 2023 వరకూ సేవలందించేందుకు సిద్ధం కాని పరిస్థితి. 44,570 టన్నుల బరువుతో సముద్రంపై కదులుతూ, జెట్ యుద్ధ విమానాల రాకపోకలకు సహకరించే విక్రమాదిత్య, వచ్చే ఆరేడు నెలలూ పోర్టుకే పరిమితం కానుందని పార్లమెంటులో ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం కొచ్చిన్ లోని షిప్ యార్డులో నిర్మాణ దశలో ఉన్న విక్రాంత్ మరో ఏడేళ్ల తరువాతనే ప్రయాణానికి సిద్ధమవుతుందని కూడా మోదీ సర్కారు ప్రకటించింది. ఏదైనా దేశంతో యుద్ధం చేయాల్సి వస్తే, భారత్ కు సముద్ర జలాల పరిరక్షణ అత్యంత కీలకం. సముద్రంలో నిలిచి విమాన, క్షిపణి విధ్వంసక రాకెట్లను ప్రయోగించే శక్తి లేకుంటే, దేశ భద్రతే ప్రశ్నార్థకమవుతుంది. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ తీరాల్లో విమాన వాహక యుద్ధ నౌకలు తప్పనిసరి. భారత నావికా దళానికి మూడు యుద్ధ నౌకల అవసరం ఉండగా, ఒక్కటి మాత్రమే అందుబాటులో ఉంది. అది కూడా ఎనిమిది నెలల పాటు సేవలకు దూరం కానుండటం భద్రతా పరంగా కొంత మేర ఆందోళనకరమేనని నిపుణులు వ్యాఖ్యానించారు.