: వర్షాలతో 8 శాతానికి జీడీపీ: నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతంగా అంచనా వేస్తున్న స్థూల జాతీయోత్పత్తి రేటు, మంచి వర్షాలతో 8 శాతం వరకూ పెరిగే అవకాశాలు ఉన్నాయని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగారియా వ్యాఖ్యానించారు. "ఈ సంవత్సరం సంతృప్తికర వర్షాలు కురిసి వృద్ధి రేటు ప్రభావితం అవుతుందని ఆశిస్తున్నాను. సరైన సమయంలో వానలు కురుస్తున్నాయి. మంచి వ్యవసాయ వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నాము" అని ముఖ్య కార్యదర్శులు, ప్రణాళికా కార్యదర్శుల సమావేశంలో పనగారియా వ్యాఖ్యానించారు. పెరిగే వ్యవసాయ రంగం ఉత్పత్తి, మొత్తం జీడీపీని ముందుకు నడిపిస్తుందని, ఈ సంవత్సరం 8 శాతం గణాంకాలను దాటే అవకాశాలను కొట్టి పారేయలేమని ఆయన అన్నారు. గడచిన మార్చి త్రైమాసికంలో ఐదేళ్ల రికార్డు స్థాయిలో 7.9 శాతం వృద్ధి నమోదైందని గుర్తు చేసిన ఆయన, తదుపరి రెండు త్రైమాసికాల్లో అంతకు మించి ప్రగతిని సాధించాల్సి వుందని అభిలషించారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై, 15 ఏళ్ల విజన్ (2030 వరకూ), వచ్చే ఏడేళ్లలో చేపట్టాల్సిన వ్యూహాలు, తదుపరి మూడేళ్లలో అభివృద్ధిపై కార్యాచరణ ప్రణాళిక డాక్యుమెంట్లపై చర్చించి, మోదీ సలహా, సూచనలు తీసుకోనున్నామని పనగారియా వెల్లడించారు.