: ఖరారైన సమయం... ఏపీకి హోదాపై రేపు మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభలో చర్చ!
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లుపై రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాజ్యసభలో చర్చ జరగనుంది. ఈ మేరకు నేటి మధ్యాహ్నం సమావేశమైన రాజ్యసభ అఖిలపక్ష సమావేశం నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై నిత్యమూ అట్టుడుకుతున్న రాజ్యసభలో, వాయిదాలు పడటం మినహా, మరే విధమైన కార్యకలాపాలూ సాగకపోవడంతో డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ అఖిలపక్ష నేతలను పిలిచి ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. కాగా, చర్చకు మాత్రమే అనుమతిస్తామని బీజేపీ ఇప్పటికే స్పష్టం చేయగా, దీనిపై ఓటింగ్ కు కూడా కాంగ్రెస్ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.