: తమ ఎన్నికల్లో ఐఎస్ఐ రిగ్గింగ్ చేసిందంటూ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో లక్షలాది మంది నిరసన... తీవ్ర ఉద్రిక్తత
పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని లక్షలాది మంది ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలుపుతుండటంతో ముజఫరాబాద్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ప్రాంతంలో 21వ తేదీన ఎన్నికలు జరుగగా, ఐఎస్ఐ (పాక్ గూఢచార సంస్థ), తాము ఓట్లేయకుండా చేసి, రిగ్గింగ్ చేయడం వల్లే నవాజ్ షరీఫ్ పార్టీ విజయం సాధించిందని ఆరోపిస్తూ, ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్ - పీఎంఎల్-ఎన్) 41 స్థానాలకు గాను 32 చోట్ల విజయం సాధించింది. ఆపై ముస్లిం కాన్ఫరెన్స్ పార్టీ మద్దతుదారులపై పీఎంఎల్ (ఎన్) కార్యకర్తలు దాడులకు దిగారు. ఓ నేతను హత్య చేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. తమ ఓట్లు తాము వేసుకోలేకపోయామని, షరీఫ్ కు అనుకూలంగా ఉన్న ఐఎస్ఐ అన్ని పోలింగ్ బూత్ లనూ ఆక్రమించి రిగ్గింగ్ చేసిందని, ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా పాకిస్థాన్ లో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఐఎస్ఐ రిగ్గింగ్ చేస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కాగా, హిమాలయా రీజియన్ లో ఉన్న ఈ ప్రాంతం తమదంటే తమదని 1948 నుంచి భారత్, పాక్ లు వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడి ప్రజల్లో అత్యధికులు భారత్ తో కలిసుండాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ ప్రాంతాన్ని పాక్ ఆక్రమించుకుని ప్రజల్ని నానా ఇబ్బందులూ పెడుతోంది. పాక్ లో పెరుగుతున్న ఉగ్రవాదం పట్ల ఇక్కడి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని పీఓకేలో పర్యటించి వచ్చిన అంజుమన్ మింజాహ్-ఏ-రసూల్ చైర్మన్ మౌలానా సయ్యద్ అథార్ హుస్సేన్ దహ్లావీ వ్యాఖ్యానించారు. పీఓకే ప్రజలు శాంతి కాముకులని, తిరిగి ఇండియాలో కలవాలని భావిస్తున్న వీరు, రెఫరెండం కోరుతున్నారని తెలిపారు. రెఫరెండం నిర్వహించాలన్న ఆలోచన పాక్ ప్రభుత్వానికి ఎంతమాత్రమూ లేదని తెలిపారు.