: కేంద్ర ఉద్యోగులపై గుదిబండ... పనితీరు బాగా లేకుంటే వార్షిక ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల కోత
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు మెరుగు పడకుంటే, వారికి లభించే వార్షిక ఇంక్రిమెంట్లలో కోత విధించాలని కేంద్రం నిర్ణయించింది. అంచనాలకు తగ్గట్టుగా పనిచేయని వారిపై కొరడా ఝుళిపించాలని భావిస్తున్న కేంద్రం, ఉద్యోగులకు లభించాల్సిన ప్రమోషన్లకు గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయాలని కూడా నిర్ణయించింది. వెరీ గుడ్, గుడ్ స్థాయులను గుర్తించి అందుకు తగ్గట్టుగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఏడవ వేతన సంఘ సిఫార్సులను నోటిఫై చేస్తూ విడుదల చేసిన ఆదేశాల్లో ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగుల పనితీరు బేరీజు వేసేందుకు ఎంఏసీపీ (మాడిఫైడ్ అస్యూర్డ్ కెరీర్ ప్రోగ్రెషన్) పేరిట ప్రత్యేక స్కీమును అమలు చేయాలని సూచించింది. నిర్దేశిత బెంచ్ మార్క్ సాధించని ఉద్యోగుల వార్షిక ఇంక్రిమెంట్లు నిలిపి వేయాలని, తొలి 20 సంవత్సరాల సర్వీసులో రావాల్సిన ప్రమోషన్లు ఆపాలని ఆదేశించింది. ఈ నిర్ణయంతో ఉద్యోగుల పనితీరు మెరుగుపడుతుందని భావిస్తున్నట్టు ఆర్థిక శాఖ వెల్లడించగా, ఉద్యోగ సంఘాలు మాత్రం మండిపడుతున్నాయి. ఎంఏసీపీ అమలు చేస్తే, ఉన్నతాధికారుల అడుగులకు మడుగులు వత్తే వారికే ప్రమోషన్ల చాన్స్ ఉంటుందని వారు ఆరోపిస్తున్నారు. కాగా, ప్రస్తుతం దాదాపు 50 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో విధులు నిర్వహిస్తుండగా, వారిలో అత్యధికులు భారతీయ రైల్వేల్లో పనిచేస్తున్నారన్న సంగతి తెలిసిందే.