: భారత సైన్యానికి ప్రాణాలతో చిక్కిన మరో ఉగ్రవాది
జమ్మూకాశ్మీర్ లో భద్రతా దళాలకు మరో పాక్ ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడ్డాడు. కుప్వారా జిల్లాలోని నౌగామ్ సెక్టారులో ఎన్ కౌంటర్ జరిగిన వేళ, నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను సైన్యం కాల్చి చంపగా, లాహోర్ కు చెందిన బహదూర్ అలీ అలియాస్ సైఫుల్లా (22) పోలీసులకు పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి మూడు రైఫిళ్లు, రెండు పిస్టల్స్ తో పాటు రూ. 23 వేల భారత కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్టు భద్రతాదళ వర్గాలు వెల్లడించాయి. గడచిన రెండు నెలల వ్యవధిలో పాక్ ఉగ్రవాదులు ప్రాణాలతో పట్టుబడటం ఇది రెండోసారి. "పాక్ ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకోవడం పెద్ద సక్సెస్. ఉగ్రవాదం వెనుక పాక్ మూలాలు ఉన్నాయన్న విషయం మరోసారి ప్రపంచానికి తెలుస్తుంది" అని హోం శాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. కాశ్మీర్ లోయలో అశాంతిని పెంచేందుకు పాక్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.