: పుష్కరాల సమయంలో రోజుకు రెండు లక్షల లడ్డూ ప్రసాదం.. నలభై వేల మందికి భోజనాలు: దుర్గ గుడి ఈవో
వచ్చే నెల 12 నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులు విజయవాడలోని కనకదుర్గమ్మ దర్శనం చేసుకుంటారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశముండటం, ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారనే విషయమై దుర్గ గుడి ఈవో సూర్యకుమారి మాట్లాడుతూ, పుష్కర పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ఇక్కడ పనిచేసి వెళ్లిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను పనుల నిమిత్తం పిలిపించామన్నారు. ఈ పనుల్లో ఇద్దరు ఈఈలు, ఏఈలు తలమునకలై ఉన్నారన్నారు. పుష్కర ఏర్పాట్లలో పాల్గొనేందుకు ఇతర ఆలయాల నుంచి 120 మందిని డిప్యుటేషన్ పై పంపించాలని అడిగామన్నారు. పుష్కరాల నాటికల్లా అర్జునవీధి విస్తరణ పూర్తవుతుందని చెప్పారు. దర్శనార్థం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తమ అంచనాల ప్రకారం రోజుకు 40 వేల మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నామని, ఒకవేళ అంతకు మించి వచ్చినప్పటికీ కూడా ఏర్పాట్లు చేస్తామన్నారు. అమ్మవారి లడ్డు ప్రసాదం తయారీకి బ్రాహ్మణవీధిలోని బుద్దువారి ఆలయంలో ఏర్పాట్లు జరుగుతున్నాయని, రోజుకు రెండు లక్షల లడ్డూ ప్రసాదాన్ని అందజేయాలనేది తమ లక్ష్యంగా ఉందని సూర్యకుమారి పేర్కొన్నారు.