: హీరో విజయకాంత్, ఆయన భార్య ప్రేమలతను అరెస్ట్ చేసి హాజరు పరచాలని కోర్టు ఆదేశాలు
తమిళనాడు డీఎండీకే వర్గాల్లో గుబులు పుట్టించిన వార్త ఇది. తమ పార్టీ అధినేత విజయకాంత్, ఆయన భార్య ప్రేమలతను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచాలని తిరుప్పూర్ కోర్టు వారెంట్ ను జారీ చేసింది. ముఖ్యమంత్రి జయలలితపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై విచారణకు రానందుకు కోర్టు వారెంట్ ను జారీ చేసింది. గతంలో అమ్మను టార్గెట్ చేస్తూ, వీరిద్దరూ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ న్యాయవాది సుబ్రమణియన్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. న్యాయమూర్తి నటరాజన్, సమన్లు జారీ చేసినప్పటికీ, విజయకాంత్ దంపతులు వాటిని ఖాతరు చేయలేదు. పరిస్థితులు పార్టీకి అనుకూలంగా లేకపోవడంతో తమ నేతలను ఎప్పుడు అరెస్ట్ చేస్తారోనన్న ఆందోళన డీఎండీకే వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాగా, రాష్ట్రంలోని పలు కోర్టుల్లో వీరిద్దరిపైనా పరువు నష్టం దావా కేసులు విచారణ దశలో ఉన్నాయి.