: బీఫ్ తిన్నాడని ఇఫ్లూలో సీటు నిరాకరణ.. వివాదానికి దారితీసిన యూనివర్సిటీ వైఖరి


హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ) ఓ విద్యార్థి సీటు విషయంలో వ్యవహరించిన తీరు ఇప్పుడు వివాదాస్పదమైంది. బీఫ్ తిన్నాడన్న ఒకే ఒక్క కారణంతో కేరళకు చెందిన జలీస్‌కు యూనివర్సిటీ యాజమాన్యం సీటు నిరాకరించింది. ఎంఏ అరబిక్ పూర్తిచేసిన జలీస్ అరబిక్‌లో పీహెచ్‌డీ ఎంట్రన్స్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశాడు. హాల్‌టికెట్ డౌన్‌లోడ్ కాకపోవడంతో యాజమాన్యాన్ని సంప్రదించిన జలీస్ వారు చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయాడు. ఇఫ్లూలో గతేడాది నిర్వహించిన బీఫ్ ఫెస్టివల్‌లో అతను బీఫ్ తినడమే ఇందుకు కారణమని యాజమాన్యం చెప్పడంతో నిర్ఘాంతపోయాడు. అంతేకాదు, బీఫ్ తిన్న ఘటనలో కేసు కూడా నమోదైందని పేర్కొంది. ఈ కారణంగానే అతనికి అడ్మిషన్ నిరాకరించినట్టు పేర్కొంది. బీఫ్ తన ఆహారపు అలవాటని, అది తినడం నేరమెలా అవుతుందని జలీస్ ప్రశ్నిస్తున్నాడు. ఈ సాకుతో విద్యార్థుల అడ్మిషన్లను ఉద్దేశపూర్వకంగా యూనివర్సిటీ అడ్డుకుంటోందని ఆరోపించాడు. మార్కులను లెక్కించాల్సిన వర్సిటీ మాంసాహారులను లెక్కిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News