: ఏపీకి ప్రత్యేక హోదా బిల్లు కంచికే! కాంగ్రెస్ ఆశలపై బీజేపీ నీళ్లు
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో పూర్తిగా చతికిలపడిన కాంగ్రెస్.. ప్రత్యేక హోదా పోరుతో మళ్లీ పట్టుసాధించాలని భావించి ఆ దిశగా దృష్టిసారించింది. అందులో భాగంగా కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పునర్విభజన చట్టంలో ప్రత్యేక హోదాను చేర్చాలంటూ సభలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ వ్యూహాన్ని ముందుగానే అర్థం చేసుకున్న బీజేపీ ద్రవ్యబిల్లు, నిబంధనల పేరుతో ఆ బిల్లుపై ఓటింగ్ జరిగే అవకాశమే లేకుండా చేసి కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లింది. ఆ బిల్లు తిరిగి చర్చకు వచ్చే అవకాశమే లేదని తెలుస్తున్నా కాంగ్రెస్ నేతలు మాత్రం వచ్చనెల 5న చర్చకు వచ్చే అవకాశం ఉందని ఆశగా చెబుతున్నారు. కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ అండ్ ప్లానింగ్ అథారిటీ (కాంపా) బిల్లును అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రత్యేక హోదా బిల్లును కాంగ్రెస్ సహా విపక్షాలు ఆయుధంగా వాడుకుంటున్నాయని భావిస్తున్న బీజేపీ ముందస్తు వ్యూహం ప్రకారమే అరుణ్‌జైట్లీని రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. ప్రత్యేక హోదా బిల్లుపై ఓటింగ్ జరగాల్సిందేనని సీపీఎం నేత ఏచూరి సీతారాం చేసిన డిమాండ్‌కు స్పందించిన జైట్లీ మాట్లాడుతూ ద్రవ్యబిల్లుపై ఓటింగ్‌కు పట్టుపట్టడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఆ బిల్లును ప్రవేశపెట్టాల్సింది లోక్‌సభలోనని, రాజ్యసభలో కాదని అ న్నారు. ఒకవేళ ప్రవేశపెట్టినా ఓటింగ్‌కు పట్టుబట్టడం సరికాదని తేల్చిచెప్పారు. దీంతో ఏం చేయాలో పాలుపోని కాంగ్రెస్ సభ్యులు కాసేపు సభను అడ్డుకుని వాయిదాకు కారణమయ్యారు. నిజానికి ప్రైవేటు బిల్లుపై చర్చ జరిగినా ప్రభుత్వ హామీతో బిల్లును ఉపసంహరించుకోవడం ఇప్పటి వరకూ వస్తున్న ఆనవాయతీ. గతంలో ప్రకాశ్ జవదేకర్ ప్రత్యేక తెలంగాణ బిల్లును సైతం ఇలాగే ఉపసంహరించుకున్నారు. కానీ కాంగ్రెస్ ఈ విషయంలో ఓటింగ్‌కు పట్టుబట్టడంతో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి అడ్డుకుంది. దీంతో ఆగస్టు 5న కూడా కేవీపీ బిల్లుపై చర్చ అనుమానంగానే కనిపిస్తోంది. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.