: తెలంగాణ రాష్ట్ర 'ఎంసెట్-2' పేపర్ లీకేజీ కేసులో అరెస్టులకు సిద్ధమవుతున్న సీఐడీ


సంచలనం సృష్టించిన తెలంగాణ రాష్ట్ర ఎంసెట్-2 పేపర్ లీకేజీ కేసులో సీఐడీ అధికారులు అరెస్టులకు రంగం సిద్ధం చేస్తున్నారు. ర్యాంకుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులతో పెద్ద ఎత్తున డీల్ కుదుర్చుకున్న వారిని అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్నారు. పేపర్ లీకేజీకి సంబంధించి ఇప్పటికే కొన్ని ఆధారాలను సేకరించిన అధికారులు.. మధ్యవర్తులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు నోటీసులు జారీ చేయనున్నారు. మంగళవారం కొందరు అనుమానితులను హైదరాబాద్‌లో ప్రశ్నించిన సీఐడీ అధికారులు ఇంకొంచెం ముందుకు వెళ్లి అరెస్టులకు తెరతీయాలని భావిస్తున్నారు. ఇక నిన్న పోలీసులు విచారించిన వారిలో వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. కాగా, ఈ కేసులో మొదట్లో తెరపైకి వచ్చిన మధ్యవర్తి వెంకట్రావుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదని చెబుతున్న అధికారులు దయాకర్, విష్ణు, రమేశ్ అనే మధ్యవర్తులు, ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు కుమార్ పేర్లు కొత్తగా తెరపైకి వచ్చినట్టు పేర్కొన్నారు. వారికి కూడా నోటీసులు జారీ చేసి విచారణకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ వ్యవహారంలో విజయవాడకు సంబంధం లేదని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో హైదరాబాద్, వరంగల్‌పైనే అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టారు. ఈ స్కాంకు బెంగళూరు, ముంబైతో ఏమైనా సంబంధాలున్నాయేమోనన్న అనుమానంతో ప్రత్యేక బృందం ఒకటి అటు వెళ్లింది. కొందరు అధికారులు ప్రకాశం జిల్లా కనిగిరి వెళ్లి కొందరు మధ్యవర్తులను ప్రశ్నించినట్టు సమాచారం. కౌన్సెలింగ్ ఎలాగూ వాయిదా పడడంతో కేసును మరో రెండు మూడు రోజుల్లోనే ముగించాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో అనుమానితులను కార్యాలయానికి పిలిపించి విచారిస్తున్న అధికారులు విద్యార్థులను మాత్రం వారి ఇళ్ల వద్దే ప్రశ్నించాలని నిర్ణయించారు. మొత్తంగా 70 మంది విద్యార్థులను ప్రశ్నించనున్నారు. అయితే నోటీసులు జారీ చేసి వారిని ఇబ్బందులకు గురిచేయడం వల్ల వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని, అందుకే వారిని ఇళ్ల వద్దే విచారించాలని నిర్ణయించినట్టు ఓ అధికారి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News