: ప్రజల ముందు పలుచన కాకండి... ప్రతిపక్ష నేతలకు హరీష్ రావు సూచన
ప్రజలకు మేలు చేసే ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకోవద్దని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు విపక్షాలకు హితవు పలికారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేవలం రాజకీయాల కోసం ప్రజలకు అన్యాయం జరగనీయొద్దని సూచించారు. తామేమీ అడ్డగోలుగా భూసేకరణ చేపట్టడం లేదన్న సంగతి ఆందోళన చేస్తున్న పార్టీలన్నింటికీ తెలుసని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాజధాని పేరు చెప్పి ఏపీలో 53 వేల ఎకరాలు సేకరించిన టీడీపీ నేతలు కూడా తమను ప్రశ్నించడం హాస్యాస్పదమని అన్నారు. ఆ పార్టీ నేతలు భూసేకరణ పేరుతో రెండు పంటలు, మూడు పంటలు పండే భూములను అరచేతిలో స్వర్గం చూపిస్తూ ఎలా దోచుకుంటున్నారో గుర్తించాలని టీడీపీ నేతలకు ఆయన సూచించారు. కర్ణాటకలో దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు ఏర్పాటుకు కాంగ్రెస్ ఎలాంటి పధ్ధతి అవలంబిస్తోందో ఆ పార్టీ తెలంగాణ నేతలు తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఒక పారిశ్రామిక వేత్తకు వందల ఎకరాల భూమి కట్టబెట్టేందుకు సీపీఐ ప్రభుత్వం పశ్చిమబెంగాల్ లో ఎలాంటి చర్యలు చేపట్టిందో ఆ పార్టీ నేతలు గుర్తు చేసుకోవాలని ఆయన హితవు పలికారు. ఇలాంటి పార్టీలు ఇప్పుడు అకస్మాత్తుగా ప్రజల్లోకి వెళ్లి న్యాయం చేసేస్తామంటే వారు విశ్వసిస్తారా? అని ప్రశ్నించారు. రాజకీయాలకోసం ఇక్కడి ప్రజల నోట్లో మట్టికొట్టవద్దని, ప్రజలకు తమ పార్టీ న్యాయం చేస్తుందని ఆయన తెలిపారు.