: రాజకీయ భిక్ష పెట్టిన వారిని నట్టేట ముంచుతున్న కేసీఆర్: జీవన్ రెడ్డి
రాజకీయ భిక్షపెట్టిన మెదక్ ప్రజలను సీఎం కేసీఆర్ నట్టేట ముంచుతున్నారని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఆరోపించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న సందర్భంగా ఆయనతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులను కరీంనగర్ జిల్లా అల్గునూర్ లో అదుపులోకి తీసుకున్న అనంతరం మానకొండూర్ పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ, నాలుగు జిల్లాలకు సాగునీరందించేందుకు నిధులు మంజూరు చేసిన ప్రాజెక్టులను గాలికి వదిలేశారని అన్నారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల ఆయకట్టుకు సాగునీరందించేందుకు నిధులు మంజూరు చేస్తే... రీడిజైనింగ్ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆయన ఆరోపించారు. మల్లన్నసాగర్ ముంపు బాధితులకు 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ చట్టం ద్వారా రైతులకు న్యాయం దొరుకుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.