: రైతుల‌ను ఒప్పించి, మెప్పించి భూసేకర‌ణ చేస్తాం: హ‌రీశ్‌రావు


తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్ష‌పార్టీల నేత‌లు రైతుల‌ను రెచ్చ‌గొడుతూ ఉద్రిక్త ప‌రిస్థితులు సృష్టిస్తున్నారని రాష్ట్ర భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హైద‌రాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఈరోజు ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల్లా తాము చ‌రిత్ర‌హీనులుగా మిగిలిపోద‌లచుకోలేదని అన్నారు. రైతుల‌ను ఒప్పించి, మెప్పించి భూసేకర‌ణ చేస్తామ‌ని హ‌రీశ్‌రావు వ్యాఖ్యానించారు. దేశంలో ఏ ముఖ్య‌మంత్రీ చేయ‌నంత కృషి తెలంగాణ ముఖ్య‌మంత్రి చేస్తున్నార‌ని, కోటి ఎక‌రాల‌కు నీరందించ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని హ‌రీశ్‌రావు అన్నారు. రాష్ట్రం ప‌చ్చ‌గా ఉండాల‌ని సీఎం రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల విష‌యంలో ప్ర‌తిప‌క్షాలు ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొడుతుంటే, గ‌త పాల‌కులు చేసిన త‌ప్పుల‌ను తాము స‌రిదిద్దుతున్నామ‌ని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేత‌లు అధికారంలో ఉన్న‌ప్పుడు ఒక మాట, ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు మరోమాటా మాట్లాడుతున్నాయ‌ని ఆయ‌న అన్నారు. తెలంగాణ‌లో ఆక‌లిచావులకు, ఆత్మ‌హ‌త్య‌ల‌కు కాంగ్రెస్, టీడీపీ పార్టీలే కార‌ణమ‌ని హ‌రీశ్‌రావు ఆరోపించారు. ప్రాజెక్టుల‌కు రీడిజైనింగ్ చేసి కోటి ఎక‌రాల‌కు నీరు ఇవ్వాల‌ని కృషి చేస్తున్నామని ఆయ‌న పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేలా ప్ర‌తిప‌క్షాలు కోడిగుడ్డు మీద ఈక‌లు పీకేలా వ్య‌వ‌హ‌రిస్తున్నాయని ఆయ‌న ఎద్దేవా చేశారు. ప్ర‌జ‌ల‌ను ఒప్పించి త‌ప్ప‌నిస‌రిగా మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ క‌డ‌తామ‌ని ఆయ‌న ఉద్ఘాటించారు. ప్ర‌జ‌లంతా ఓ వైపు ఉంటే, ప్ర‌తిప‌క్షాలు మ‌రోవైపు ఉన్నాయ‌ని అన్నారు. టీడీపీ నేత‌లు గ‌ల్లీలో ఓ మాట, ఢిల్లీలో ఓ మాట మాట్లాడుతున్నారని హ‌రీశ్‌రావు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News