: కరీంనగర్, మెదక్ జిల్లాల్లోనూ కాంగ్రెస్ నాయకుల అరెస్ట్
పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్న వారిని పరామర్శించేందుకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ 'ఛలో మల్లన్నసాగర్' కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ నేతలు మల్లన్నసాగర్ ప్రాంతానికి చేరుకోకుండా పోలీసులు వారిని ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్లో పోలీసులు పలువురు కాంగ్రెస్ నేతలను అరెస్టు చేసిన సంగతి విదితమే. అలాగే, కరీంనగర్, మెదక్ జిల్లాల్లోనూ పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ నుంచి మల్లన్నసాగర్కు బయలుదేరిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తో పాటు పలువురు నేతలను జిల్లాలోని అలుగునూరు వద్ద పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులకి, కాంగ్రెస్ నేతలకి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. మరోవైపు, మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి మల్లన్నసాగర్ ప్రాంతం వైపు వెళ్లేందుకు డీకే అరుణ, రాజనర్సింహ, అద్దంకి దయాకర్, శ్రవణ్ ప్రయత్నించారు. అయితే గజ్వేల్లోనే పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.